దానా తుఫానుతో ఒడిశా విలవిల ! 1 m ago
దానా తుఫాను ప్రస్తుతం ఒడిషా తీరప్రాంతం వైపు దూసుకుపోతోంది, శుక్రవారం తెల్లవారుజామున తీరాన్ని తాకనుంది. ఈ తుఫాను పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ భాగం మరియు ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్థాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం నాటికి 'డేంజర్ జోన్'లో నివసిస్తున్న 30 శాతం మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. 30 శాతం అంటే దాదాపు 3 నుండి 4 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. మిగిలిన అన్ని ప్రమాద మండలాల్లోని ప్రజల తరలింపు ప్రక్రియ గురువారం ఉదయం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున నేషనల్ పార్క్ మరియు ధామ్రా పోర్ట్ మధ్య దానా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 120 కీమీ వేగంతో ఈదురు గాలులు
దీని ప్రభావంతో గంటకు 120 కీమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది. అందువల్ల, అక్టోబర్ 24 రాత్రి మరియు అక్టోబర్ 25 ఉదయం మధ్య తుఫాన్ తీరందాటే సమయంలో భారీ వర్షపాతం, భీకర ఈదురు గాలులతో తుఫాను ఉప్పెన గరిష్ట స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఆ సమయంలో ఒడిశా బహుళ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపింది. సముద్రంలో అలలు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని వెల్లడించింది. కోల్‌కతాతో సహా భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని రాజధాని నగరాలకు బయలుదేరే విమానాలు గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు నిలిపివేశారు.